ప్రపంచం వేడెక్కుతోంది. ఓవైపు ఆకాశం తన రంగు కోల్పోతుంటే.. భూమి తన శ్వాస కోసం వెతుకుతోంది. మనిషి మాత్రం ఇంకా సౌకర్యాల వెనక పరుగెడుతున్నాడు. ఇది ప్రకృతి కథ కాదు.. ఇది మనిషి కథ.. అంటే మనందరి కథ..! కానీ మనలో కొంతమంది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పేదల శ్రమని దోపిడీ చేస్తూ లక్షల కోట్లు సంపాదించే ధనవంతుల గురించి కచ్చితంగా చర్చించుకోవాలి. ఎందుకంటే క్లైమేట్ ఇన్ఇక్వాలిటి రిపోర్ట్ ప్రకారం.. ఈ భూమిని నాశనం చేస్తున్నది వాళ్లే! అవునండి..! వారి సంపద పెరుగుతున్నంత వేగంగా భూమి శ్వాస తగ్గుతోంది. వారి గృహాలు ప్రకాశిస్తున్నంత వరకు. గ్రామాలు చీకటిలో మునిగిపోతున్నాయి. వారు కల్పించిన ప్రగతి మనకు చూపిస్తున్న వెలుగే అయినా.. ఆ వెలుగు కిందనే దాగి మన భవిష్యత్తు చీకటిగా మారిపోతుందంటే నమ్మగలరా? మీరు నమ్మకపోయిన ఇదే నిజం!
పేదరికం పెరిగిపోతోంది:
ప్రపంచంలో టాప్ రిచెస్ట్ వ్యక్తుల శాతం కేవలం వన్-పర్శెంట్ మాత్రమే అయినా ఉద్గారాల్లో 41శాతం బాధ్యత వారిదే. ఒక్కొక్కరు పేద ప్రజలతో పోలిస్తే 680రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. ఇది కేవలం ఒక లెక్క కాదు.. ఇది మన అసమాన ప్రపంచానికి అద్దం. ధనం పెరిగిన కొద్దీ వాతావరణం కరుగుతుంటే.. వాతావరణం కరిగిన కొద్దీ పేదరికం పెరుగుతోంది. ఈ బడా ధనవంతులు కేవలం వినియోగం ద్వారా కాకుండా పెట్టుబడుల ద్వారా కూడా భూమిని కాలుస్తున్నారు. అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టిన కంపెనీలు చమురు తవ్వకాలు చేస్తుండగా.. ఇటు బొగ్గు తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నాయి. పాత కాలం ఇంధనాలను కొత్త పూతతో మళ్లీ అమ్ముతుండడం అత్యంత దారుణమైన విషయం.
2050నాటికి మహావినాశనం:
ఈ బడాబాబుల కారణంగా ప్రపంచం మొత్తం వాతావరణ నష్టం ఎదుర్కొంటున్నది. కానీ ఆ నష్టం సమానంగా పంచబడడం లేదు.. 2050నాటికి పేద వర్గాలు తమ ఆదాయంలో 74శాతం వరకు కోల్పోతారట. అదే సమయంలో ధనవంతుల మాత్రం 3శాతం మాత్రమే కోల్పోతారు. దీనిబట్టి ఒక వైపు భూమి వేడెక్కుతుంటే.. మరోవైపు సమానత్వం చల్లబడుతుందని చెప్పవచ్చు. ఇటు ప్రపంచ సంపద కూడా అదే మార్గంలో కదులుతోంది. నిజానికి ప్రపంచ సంపదలో 38శాతం ధనవంతుల చేతిలోనే ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే అతి త్వరలోనే ఈ సంఖ్య 46శాతానికి చేరుతుంది. అయితే ఇదే సమయంలో న్యాయం జరిగితే.. పన్నులు న్యాయంగా విధిస్తే.. ప్రజా పెట్టుబడులు పెరిగితే.. అదే సంపద 26శాతానికి తగ్గవచ్చు. కానీ అలాంటి మార్పు రావాలంటే ధనవంతుల దోపిడీ ఆగాలి. ఇటు పేద దేశాలు మరో వలయంలో చిక్కుకున్నాయి. వీళ్లంతా తక్కువ కాలుష్యం సృష్టించినా, ఎక్కువ వడ్డీతో రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా చూస్తే వాతావరణం మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థ కూడా ధనవంతుల చేతుల్లో బందీ అయిందని చెప్పవచ్చు.
భూమిని మొత్తం దోచేస్తున్నారు:
ఇక బడాబాబులు భూమి వనరులను కూడా సొంతం చేసుకుంటూ పోతున్నారు. పీల్చే గాలి మీద కూడా హక్కు వారిదే అవుతోంది. ఇటు సముద్రాలపై ప్రాజెక్టులు కడుతూ.. ఈ ప్రపంచం మనదని చెప్పుకుంటున్న మన ఊపిరిని కూడా అమ్మేస్తున్నారు. గతంలో బంగారం కోసం దోచుకుంటే.. ఇప్పుడు హరిత విప్లవం పేరుతో భూమి శక్తినే దోచుకుంటున్నారు. పాత దోపిడీకి కొత్త పేరే వచ్చింది కానీ చోరీలో మాత్రం ఏ మార్పూ రాలేదు.
ప్రపంచం నిజమైన మార్పు కోసం ఎదురుచూస్తోంది. కొత్త పన్నులు, న్యాయమైన కార్బన్ పన్నులు ధనవంతులపై వెయ్యాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రభుత్వాలు ధనవంతుల కార్బన్ లాభాలపై పన్ను వేయాలి. ప్రజల డబ్బుతో, ప్రజల యాజమాన్యంతో, స్వచ్ఛమైన శక్తి మార్గాలు సృష్టించాలి. అప్పుడు మాత్రమే మన భూమి న్యాయంగా ఊపిరి తీసుకుంటుంది. ఈ పోరాటం సామాన్య ప్రజల నుంచి కూడా మొదలవ్వాలి. మన ఊపిరి కోసం.. మన నీటి కోసం.. మన భూమి కోసం.. మన భవిష్యత్తు కోసం ఈ పోరాటం తప్పదండి..!
