పొగ ఇంకా చల్లారలేదు. గోడలు ఇంకా వేడిగానే ఉన్నాయి. ఆ శిథిలాల మధ్య ఒక తల్లి మోకాళ్లపై కూర్చుని ఏడుస్తోంది. చేతులతో బూడిదను తడుముతూ విలపిస్తోంది. ‘నా బిడ్డ ఎక్కడ?’ అని రోదిస్తోంది. ఒక భర్త కాలిపోయిన మసీదు గడప దగ్గర నిలబడి ఉన్నాడు. అతను శవాలను చూస్తున్నాడు. అతనికి ఆమె భార్య మృతదేహం మాత్రం కనిపించలేదు. ఇదేదో సినిమా కథ కాదు.. ఇది గాజాలో జరిగిన యదార్థ గాధ.
అక్కడ వేల మందిని శవపేటికలో పెట్టేందుకు శరీరం లేదు. చివరి సారి చూసేందుకు ముఖం లేదు. కన్నీరు కార్చేందుకు శవం కూడా లేదు. ప్రముఖ మీడియా సంస్థ అల్-జజీరా ఇన్‌వెస్టిగేషన్‌లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. యుద్ధం అంటే చంపడం, గెలవడం మాత్రమే కాదు..శవాల గుర్తులు కూడా మిగలకుండా తుడిచే వేసే ఉన్మాదమని గాజా వార్ నిరూపిస్తోంది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? శవాలు ఎలా ఆవిరైపోయాయి?
గాజాలో 2023 అక్టోబర్ 7 నుంచి కొనసాగుతున్న యుద్ధంలో 72వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు స్థానిక ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్యలో మరో భయంకర కోణం ఉంది. గాజా సివిల్ డిఫెన్స్ బృందాల ప్రకారం 2,842మంది సామాన్యులు పూర్తిగా ఆవిరైపోయి చనిపోయారు.
గోడలపై రక్తపు చారలు, చిన్న మాంసపు ముక్కలు తప్ప పూర్తిస్థాయి శరీర అవశేషాలు కనిపించలేదు. నిజానికి ఒక ఇంటిపై దాడి జరిగితే ముందుగా అక్కడ ఎంతమంది ఉన్నారో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుంటారు. ఉదాహరణకు ఐదుగురు ఉన్నారని చెబితే మూడే మృతదేహాలు దొరికితే మిగిలిన ఇద్దరి కోసం పూర్తిగా గాలిస్తారు. శిథిలాలను తవ్వుతారు. చుట్టుపక్కల ప్రాంతాన్ని వెతుకుతారు. చివరకు ఎలాంటి అవశేషాలు దొరక్కపోతే వారిని ఆవిరైపోయినవారిగా నమోదు చేస్తారు.
ఇన్‌వెస్టిగేషన్‌లో ప్రస్తావించిన మరో అంశం థర్మోబారిక్ అండ్ థర్మల్ మ్యూనిషన్లు. ఇవి సాధారణ బాంబులు కావు. పేలుడు ముందు ఇవి భారీ అగ్ని గోళాన్ని సృష్టిస్తాయి. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 2,500 నుంచి 3,500 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చు.
మానవ శరీరంలో సుమారు 60 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది. నీరు మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీలు మాత్రమే. అప్పుడు 3,000 డిగ్రీల వేడి తాకితే కణజాలం తక్షణమే ఆవిరై బూడిదగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ ఉపయోగించిన ఆయుధాల్లో 900 కిలోల బరువున్న MK-84 బాంబులు, 109 బంకర్ బస్టర్లు, GBU-39 ప్రిసిషన్ గ్లైడ్ బాంబులు ఉన్నాయి. వీటిలో ట్రిటోనల్ లాంటి అల్యూమినియం మిశ్రమాలు ఉండి అధిక ఉష్ణోగ్రతను సృష్టిస్తాయని నివేదిక చెబుతోంది.
ఇక ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కావు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం ఉంది. ఒక తల్లి ఖాళీ ఒడిలో మిగిలిన కన్నీటి చుక్క ఉంది. శవం లేకుండా అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
యుద్ధం మనుషులను చంపుతుందని అందరికీ తెలుసు. కానీ గుర్తు కూడా మిగలకుండా తుడిచేస్తే అది కేవలం యుద్ధం మాత్రమే కాదు.. అది మానవత్వాన్ని కాల్చేసే అగ్ని. అది శరీరాన్ని కాదు జ్ఞాపకాన్ని కూడా చెరిపేసే విధ్వంసం. అది కుటుంబాలను మాత్రమే కాదు చరిత్రను కూడా శూన్యంగా మార్చే హింస!
ALSO READ: ఆడవాళ్ల శరీర అవయవాలు సామాన్లా? కేవలం ఆడవాళ్లకేనా సంప్రదాయాలు?
