ఆడవాళ్ల శరీర అవయవాలు సామాన్లా? ఎంత నీచమైన ఆలోచన ఇది..! నటుడు శివాజీ నోటిదూల ఆయన మైండ్‌సెట్‌ను కళ్లకు గట్టింది. సమంత, నిధి అగర్వాల్‌పై అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటనపై పరోక్షంగా స్పందించిన శివాజీ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై దిగజారి కామెంట్స్ చేశారు. మాటల్లో చెప్పలేనంతగా నోటికొచ్చినట్టు రెచ్చిపోయారు. మహిళను ఒక మనిషిగా చూడలేకపోయిన శివాజీ, వారి శరీరాలను సామానుగా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
నిజానికి ఇది మాటల స్వేచ్ఛ కాదు. ఇది ఆడవాళ్లపై జరిగే మానసిక దాడి. ఇది అభిప్రాయం కాదు.. ఇది శరీరాల్ని టార్గెట్ చేసే విషపూరిత ఆలోచన. స్టేజ్‌పై మైక్ దొరికితే చాలు.. మహిళల దుస్తుల మీద తీర్పులు ఇవ్వడం మొదలుపెడతారు. వాళ్ల నడక, వాళ్ల వేషధారణ, వాళ్ల శరీరాలు.. ఇలా అన్నింటిపైనా తమదే హక్కు అన్నట్టు మాట్లాడతారు. అభిమానం పేరుతో జరిగిన వికృత ప్రవర్తనలపై మాట్లాడాల్సిన చోట, బాధితులైన హీరోయిన్లనే ప్రశ్నించడం ఎంత దుర్మార్గమో కదా.
ఇటు సినిమా ఈవెంట్లలో మాట్లాడే మాటలు ఒక్క వ్యక్తి అభిప్రాయంగా ఉండవు. అవి వేల మందికి ఓ మెసేజీగా మారుతాయి. మహిళల శరీరాలను సంప్రదాయం పేరుతో కొలవడం, దుస్తులను నైతికతకు ప్రమాణంగా మార్చడం ఈ కాలంలో ఇంకా చెల్లుతుండడం అత్యంత బాధాకరం. ఇదేదో గొప్ప సందేశమన్నట్టు శివాజీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం సమాజం ఎంత వెనుకబడి ఉందో చూపిస్తోంది.
మహిళలను మగాళ్లే నియంత్రించాలన్న కోరిక బలంగా ఉన్న వాళ్లు సంస్క్రతి, సంప్రదాయమని కబుర్లు చెబుతుంటారు.. నిజానికి వాళ్లకి సంప్రదాయం పట్ల అంత ఇష్టమే ఉంటే.. మగాళ్లంతా ప్యాంటులు, షర్టులు ఎందుకు ధరిస్తున్నారు? వాళ్లు స్లీవ్‌లెస్‌లు వేసుకోవడంలేదా? షర్ట్ లేకుండా నిక్కర్‌తో ఫొటోలు దిగడంలేదా? బయటకు చెడ్డీలు వేసుకోని రావడంలేదా? ఇదేనా సంప్రదాయం? కేవలం ఆడవాళ్లకేనా సంప్రదాయాలు?
వాస్తవానికి మహిళ ఏ దుస్తులు వేసుకున్నా అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ. అది ఆమె నైతికతకు కొలమానం కాదు. కానీ మన సమాజంలో ఇంకా దుస్తులే మహిళల క్యారెక్టర్‌ను నిర్ణయిస్తున్నాయి. చీర కప్పుకుంటే సంస్కారం. జీన్స్ వేసుకుంటే తప్పు. వెస్ట్రన్ డ్రెస్ అయితే అసభ్యత. తరతరాలుగా ఇదే దిక్కుమాలిన లాజిక్. ఈ ఆలోచన వల్లే ఒక మహిళపై ఎప్పుడైనా జరగకూడనది జరిగితే ముందుగా ఆమె ఏం డ్రెస్ వేసుకుందో చర్చ మొదలవుతుంది.
అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి మాటలు గతంలో కూడా చాలాసార్లు వినిపించాయి. టాలీవుడ్ ఈవెంట్లలో మహిళల దుస్తులపై పలువురు పరోక్ష కామెంట్స్ చేశారు. ఇంకొన్నిసార్లు అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ వివాదాస్పదరీతిలో మాట్లాడిన వారు కూడా ఉన్నారు. అటు బాలీవుడ్‌లోనూ ఇదే దృశ్యం. హీరోయిన్లు సంప్రదాయం మర్చిపోయారంటూ చాలాసార్లు కామెంట్స్ వినిపించాయి. సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు ఇలా డ్రెస్ అవుతున్నారంటూ మరికొందరు సినీపెద్దలు కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ, అదే ఇండస్ట్రీలో మహిళల శరీరాల్ని మార్కెట్ చేసే పాటలు, సీన్లు, డ్యాన్స్‌లు ఉంటాయి. అక్కడ అభ్యంతరం ఉండదు కానీ.. అదే మహిళ బయట తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటే మాత్రం నీతులు గుర్తొస్తాయి. ఇది అవసరానికి తగ్గట్టు నీతులు మార్చుకునే స్వార్థం. మహిళల శరీరాలు తెరపై డబ్బు తెచ్చే వస్తువులుగా మారినప్పుడు ప్రశ్నించని సమాజం, ఆ మహిళ స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మాత్రం తీర్పులు చెబుతుంది. ఇక్కడే అసలు సమస్య బయటపడుతుంది. మహిళను వ్యక్తిగా కాదు, వినియోగ వస్తువుగా చూసే దృష్టి ఇది.
ఇటు మహిళల దుస్తులపై విమర్శలు చేసే వాళ్లలో ఒక సాధారణ లక్షణం ఉంటుంది. అదే నియంత్రణ..! మహిళల స్వేచ్ఛను భరించలేని మనస్తత్వం వారిది. అందుకే దుస్తుల్ని ఆయుధంగా వాడతారు. నిజానికి వారికి సమస్య చీరా, జీన్సా, షార్ట్ డ్రెస్సా కాదు. మహిళ తన ఇష్టం ప్రకారం నిర్ణయం తీసుకోవడమే వారికి ప్రధాన సమస్య. ఆమె నవ్వినా తప్పే, మాట్లాడినా తప్పే, నచ్చినట్టు దుస్తులు వేసుకున్నా తప్పే.
సైకాలజీ ప్రకారం నియంత్రణ కోరిక ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇతరుల స్వేచ్ఛను ప్రమాదంగా చూస్తారు. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ వారికి అసహజంగా అనిపిస్తుంది. అందుకే బాధ్యత, సంప్రదాయం, సంస్కారం అనే పెద్ద పెద్ద పదాల వెనక దాక్కొని అసలు ఉద్దేశాన్ని దాచిపెడతారు. కానీ నిజం ఏంటంటే ఇది సంస్కృతి కాదు. ఇది భయం. మహిళ స్వతంత్రంగా మారితే తమ అధికారాన్ని కోల్పోతామన్న భయం.
ఈ మైండ్‌సెట్ మారకపోతే సమస్య ఒక్క సెలబ్రిటీల వరకే పరిమితం కాదు. అది కాలేజీల్లోకి వెళ్తుంది. ఆఫీసుల్లోకి వెళ్తుంది. వీధుల్లోకి వెళ్తుంది. చివరికి ఇళ్లలోకే చేరుతుంది. మహిళలు తమ దుస్తుల గురించి కాదు, తమ భద్రత గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తేల్చుకోవాల్సిన విషయం ఒక్కటే. మహిళలు ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. దుస్తులు సంస్కృతిని నిర్ణయించవు. వ్యక్తిత్వాన్ని కొలవవు. గౌరవాన్ని తగ్గించవు. గౌరవం అనేది మన ఆలోచనల్లో ఉంటుంది. మాటల్లో ఉంటుంది. ప్రవర్తనలో ఉంటుంది.
మహిళల దుస్తులపై నీతులు చెప్పేవాళ్లు ముందుగా తమ ఆలోచనలను మార్చుకోవాలి. లేదంటే సమస్య మహిళల దుస్తుల్లో కాదు, మన మైండ్‌సెట్‌లోనే ఉందని చరిత్ర మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూనే ఉంటుంది.
