పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) జైలులో మరణించారంటూ వచ్చిన పుకార్లలో నిజం లేదని తేలిపోయింది. ఇమ్రాన్‌ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ చెప్పారు. అడియాలా జైలులో ఆమె స్వయంగా ఇమ్రాన్‌ను కలిశారు. కొన్నిరోజులుగా ఇమ్రాన్‌ఖాన్ గురించి పాకిస్తాన్ మీడియాతో పాటు అంతర్జాతీయ యిలో వార్తలొస్తున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో హ*త్య చేశారని ప్రచారం జరిగింది. కొన్నివారాలుగా ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు ఆయన అక్కచెల్లెళ్లను అనుమతించకపోవడం, నాలుగు రోజుల క్రితం జైలు బయట ఆందోళన చేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ సోదరీమణులపై లాఠీచార్జ్ జరగడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.
Story that caught the eye: Imran Khan is fine, his health is good, he is being kept in solitary confinement, he is being tortured mentally says Imran Khan’s sister,Dr. Uzma Khan after meeting him. Tragic that someone of his stature has spent two years and counting in jail without…
— Rajdeep Sardesai (@sardesairajdeep) December 2, 2025
ఆ తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)ఆందోళనలకు దిగింది. పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. PTI కార్యకర్తలు, ఇమ్రాన్‌ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి అడియాలా జైలు బయట నిరసన ప్రదర్శనలు జరిపారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్ ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరైన ఉజ్మాఖాన్కు జైలులోపలికి వెళ్లి సోదరుణ్ణి కలిసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇమ్రాన్‌ఖాన్ ముగ్గురు సోదరీమణులు అలీమాఖాన్, నౌరీన్‌ఖాన్, ఉజ్మా ఖాన్ అడియాలా జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలీసు అధికారులు మొదట వారిని మార్గమధ్యంలో ఆపివేశారు. కొంత సమయం తర్వాత, జైలు అధికారులు ఒక అధికారిని ఇమ్రాన్‌ఖాన్ సోదరీమణుల వద్దకు పంపి, ఉజ్మాఖాన్ వెళ్లేందుకు అనుమతి లభించిందని చెప్పారు. అడియాలా జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసి వచ్చిన తర్వాత ఉజ్మాఖాన్ తన సోదరుడి పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.
ఇమ్రాన్‌ఖాన్ చాలా కోపంగా ఉన్నారని, వారు తనను మానసికంగా హింసిస్తున్నారని, రోజంతా గదిలో బంధించి ఉంచుతున్నారని, కొద్దిసేపు మాత్రమే బయటకు వెళ్ళనిస్తున్నారని, ఎవరితోనూ మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, వీటన్నంటికీ అసిమ్ మునీర్‌దే బాధ్యత అని ఇమ్రాన్‌ఖాన్ చెప్పినట్టు ఉజ్మాఖాన్ తెలిపారు. 20 నిమిషాలు మాత్రమే ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడగలిగానని, ఆయన ఆరోగ్యం బాగుందని ఉజ్మాఖాన్ చెప్పారు. దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్‌ఖాన్‌ను కలవడానికి తమకు అనుమతి లేదని అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ సందేశాలు జైలు నుంచి బయటకు రావడం ప్రభుత్వానికి ఇష్టం లేదని వారు ఆరోపించారు.
నవంబరు 4న ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు నౌరీన్ఖాన్కు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఆయన్ను కలిసేందుకు ఎవరినీ పంపించకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్ చనిపోయారంటూ పుకార్లు బయలుదేరాయి. ఇమ్రాన్‌ఖాన్ కొడుకులు సహా ఎవరినీ ఫోన్లో మాట్లాడటానికి అనుమతించడం లేదని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య జెమీమా కూడా ఆరోపించారు. మ్రాన్ఖాన్కు కొడుకు తండ్రికి ఒక్క ఉత్తరం కూడా పంపలేకపోయారని ఆమె అన్నారు. ఇమ్రాన్‌ఖాన్ మృతిచెందారన్నవార్తలు ఎందుకొచ్చాయో తెలియదని నౌరీన్ఖాన్తో పాటు ఇమ్రాన్‌ఖాన్ రెండోసోదరి అలీమాఖాన్ అన్నారు.
ఈ పుకార్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని, జైలు లోపల నుంచి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. వీటిని వ్యాపింపచేస్తున్నవారు జైలు సిబ్బంది లేదా అధికారయంత్రాంగం అయి ఉండాలని ఆమె ఆరోపించారు. ప్రజలు ఎలా స్పందిస్తారో గమనించడానికి వారు ఇలా చేస్తున్నారని ఎవరో మాకు చెప్పారని ఆమె అన్నారు. ఇమ్రాన్‌ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, సొంతంగా ఆహారం తీసుకుంటున్నారని, వ్యాయామం చేస్తున్నారని, మానసికంగా బలంగా ఉన్నారని నవంబరు 4న ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసిన నౌరీన్‌ఖాన్ చెప్పారు.
జైలులో ఆహారం ఇమ్రాన్‌ఖాన్ సూచనల మేరకు వండుతారని, దానికి డబ్బులు ఆయనే చెల్లిస్తారనిని ఆమె తెలిపారు. ‘ఇమ్రాన్ ఖాన్ టీవీ ఆపేశారు, వార్తాపత్రిక నిలిపివేశారు. జైలు నిబంధనల ప్రకారం ఏ ఖైదీనీ నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం ఏకాంత నిర్బంధంలో ఉంచకూడదు’ అని ఆమె అన్నారు. ఇమ్రాన్‌ఖాన్ అదనపు సౌకర్యాలేమీ అడగడం లేదని పుస్తకాలు కావాలని, తన పిల్లలతో మాట్లాడాలని మాత్రమే అడుగుతున్నారని నౌరీన్‌ఖాన్ చెప్పారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ 2018 ఆగస్టు 18 నుంచి 2022 ఏప్రిల్ 10వరకు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు.
అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవి పోగొట్టుకున్న తొలి పాకిస్తాన్ ప్రధానిగా నిలిచారు. తనపై పెట్టిన అవిశ్వాసతీర్మానం వెనక అమెరికా హస్తం ఉందని, యుక్రెయిన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించినందుకే జో బైడన్ ప్రభుత్వం తనను పదవినుంచి తప్పించేలా కుట్రలు జరిపిందని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. భారత్‌కు, పాకిస్తాన్‌కు ఉన్న తేడా అదేనని, యుక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్‌లో ఎలాంటి రాజకీయమార్పులు జరగలేదని, ప్రధాని మోదీ పదవికి ఎలాంటి సమస్యా రాలేదని, పాకిస్తాన్లో మాత్రం కుట్రలు, కుతంత్రాలు జరిగి తాను అధికారం కోల్పోవాల్సివచ్చిందని ఇమ్రాన్‌ఖాన్ పదవినుంచి దిగిపోతూ చెప్పారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ఖాన్ అరెస్టయ్యారు. 2023మేనుంచి ఆయన జైలులో ఉన్నారు.
ALSO READ: 2050నాటికి మహా వినాశనం తప్పదా? పీల్చే గాలిని కూడా వదలని బడాబాబులు!
