Insurance Cheating: జీవిత బీమా సొమ్మును అక్రమంగా కాజేయడానికి ఓ భార్య ఏకంగా తన భర్త బతికి ఉండగానే.. అధికారుల కళ్లు గప్పి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించిన విస్మయకరమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగు చూసింది. ఈ మోసానికి పాల్పడిన దంపతులతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
మోసం ఇలా(Insurance Cheating):
ఈ ఘరానా మోసం వివరాలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్ నగర్‌కు చెందిన భూక్యా శ్రీరాములు చనిపోయినట్లుగా నిందితులు(Insurance Cheating) నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించారు. ఆ పత్రాన్ని ఉపయోగించి, మోసపూరితంగా భద్రాచలం శాఖలోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి బీమా సొమ్ము కింద ఏకంగా రూ. 10 లక్షలు అక్రమంగా డ్రా చేశారు.
ఈ సొమ్మును నిందితులు నాలుగు మందిలో వాటాలుగా పంచుకున్నారు. ఈ మోసంలో శ్రీరాములు భార్య భూక్యా రాధ, చనిపోయినట్లు నటించిన శ్రీరాములు, మోసానికి తోడ్పడిన భూక్యా లక్ష్మా, షేక్ యాకూబ్ పాషాలను భద్రాచలం పట్టణ సీఐ ఎం.నాగరాజు నేతృత్వంలోని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ పత్రాల సృష్టి, వాటిని ఉపయోగించి బీమా సొమ్మును కాజేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మోసంలో ఇంకా ప్రమేయం ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
