Montha Cyclone Effect: మోంథా తుపాను మంగళవారం అర్ధరాత్రి తరువాత ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం-కాకినాడ మధ్య, నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ బీచ్‌ను తాకింది. దీంతో గంజాం సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 80 నుండి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి, భారీ అలలు ఎగసిపడుతున్నాయి.
తుపాను ప్రభావం ఒడిశా దక్షిణ జిల్లాలు — గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి, కంధమాల్, కలహండి, నబరంగ్‌పూర్‌లపై కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 11,000 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మరొక 30,000 మందిని తరలించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 30 ODRF బృందాలు, 5 NDRF బృందాలను మోహరించారు. అటు తీర ప్రాంతాలలో మత్స్యకారులను సముద్ర యాత్రలకు వెళ్లకుండా అధికారాలు హెచ్చరించాయి. విద్యుత్ సరఫరా, సమాచార సేవల పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి.
Montha Cyclone Effect: ఆంధ్ర ప్రదేశ్ లో ఇలా..
మంగళవారం రాత్రి మోంథా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సమీప తీరాన్ని తాకింది. సాయంత్రం 7.30 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట వరకు దాదాపు ఐదు గంటలపాటు తుపాను ప్రభావం కొనసాగింది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 110 కి.మీ. వరకు నమోదైంది.
మచిలీపట్నం, కోనసీమ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతోపాటు అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలో ఒక వృద్ధ మహిళ చెట్టు కూలి మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తుపాను కారణంగా పలు గ్రామాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది.
వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, రాబోయే ఆరు గంటల్లో మోంథా తుపాను తీవ్రత తగ్గి సాధారణ తుఫానుగా మారనుంది. తుపాను సుమారు 300 కి.మీ. విస్తీర్ణాన్ని కవర్ చేస్తోంది.
ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి
ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా రక్షణ చర్యలు చేపట్టాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివాస గృహాలు, విద్యుత్ లైన్లు, రహదారుల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.
ప్రస్తుతం తుపాను తీవ్రత తగ్గుతున్నప్పటికీ, వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
తాజా సమాచారం ప్రకారం, ఒడిశా,ఉత్తర ఆంధ్ర తీరం వెంబడి వర్షాలు కొనసాగుతుండగా, గాలి వేగం క్రమంగా తగ్గుతోంది. కానీ గోపాల్‌పూర్, బేరంపుర్, ఖుర్ధా ప్రాంతాల్లో ఇంకా జాగ్రత్తలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అన్ని ప్రభావిత జిల్లాల్లో వ్యాపార, రవాణా కార్యకలాపాలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
